శ్రీ చంపకానందనాథులు (చాగల్లు శ్రీనివాసరావు గారు)

శ్రీచంపకానందనాథ దాసోహమస్మి :

శాంతచిత్తం తపోధీరమ్, శిష్యవాత్సల్య పూరితం |
చంపకానందనాథం తం, ప్రణతోస్మి ముదావహం ||

పూజ్య శ్రీ చంపకానందనాథుల వారు (చాగల్లు శ్రీనివాసరావు గారు) 1933వ సంవత్సరం, ఏప్రిల్ 26వ తేదీ అనగా వైశాఖ శుద్ధ విదియ శుభతిథినాడు అనంతపురంలోని చాగల్లు గ్రామానికి చెందిన మధ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. గృహస్థాశ్రమం స్వీకరించి చాగల్లు గ్రామంలో కరణీకము చేసేవారు. మధ్యవయస్సులో వైరాగ్యం కలిగి ఉపాసనా మార్గానికి అడ్డువస్తున్న కరణీకము వదలి కట్టుబట్టలతో కుటుంబంతో తాడిపత్రికి వచ్చేశారు.

Champakanandula Varu (Appa)

Champakanandula Varu (Srinivasa Rao Appa)

శ్రీ జోస్యం జనార్థన శాస్త్రి గారి నుండి బాలా త్రిపురసుందరీ మంత్రమును, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందారు. కొంతకాలం చాలా కటిక పేదరికంలో ఉన్నప్పటికీ అమ్మ మీద చెక్కు చెదరని భక్తి, కళ్ళలో కాంతి, ముఖంలో అగ్నిని పోలే బ్రహ్మవరచ్చస్సు. వీరు వేద, ఆగమ, తంత్ర, పురాణ వాఙ్మయములో నిష్ణాతులు. ఎన్ని సంపదలు ఉన్నా, ఏమీ లేకున్నా స్థితప్రజ్ఞతకు నిలువెత్తు విగ్రహంగా ఉండేవారు.

కాలాంతరంలో తమ ఉపాస్య దేవత అయిన లలితా పరమేశ్వరిని ప్రతిష్ఠించే సంకల్పం చేశారు. శృంగేరీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామివారు ఈ ఆలయ నిర్మాణానికి మూలధనం ఇచ్చి ఆశీర్వదించారు. లలితా పరమేశ్వరి ఆలయ నిర్మాణము అనతి కాలంలో పూర్తి అయింది. ఆ లలితా సుందరేశ్వర స్వామి ఆలయాన్ని నేటికి మనము దర్శించవచ్చు. కంచి ఆచార్యులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా తమ విజయయాత్రలో ఈ దేవాలయాన్ని సందర్శించారు.

అనుక్షణం ఆయన అమ్మ ఉపాసనలో గడిపేవారు. దసరా నవరాత్రులలో అమ్మవారికి విశేషమైన ఉత్సవాలు చేసేవారు. సామూహికంగా లలితా సహస్రనామ కుంకుమార్చన జన సామాన్యులతో చేయించేవారు. సంకల్ప సిద్ధి కలిగిన వారు. కష్టాలలో ఉన్నవారికి తమ అమృత వాక్కులతో దైవ బలాన్ని పొందే మార్గాలను సూచించేవారు. ఆర్తితో ఆశ్రయించినవారికి అమ్మవారి ఉపాసనా మార్గాన్ని ఉపదేశించారు. కొన్ని వందల మంది ఆయన నోటినుంచి వచ్చిన మాటని అమ్మవారి మాటగా స్వీకరించి దాని ఫలితాన్ని పొందారు.

2005 లో పుష్య అమావాస్య రోజున కాంచీపుర కామాక్షి దేవస్థాన స్థానికం మరియు గుహానందమండలిలో పెద్దవారు బాలా ఉపాసకులు అయిన కామకోటి శాస్త్రి గారిచే తిరుత్తణిలో
(శ్రీ బాలానందనాథులచే) శ్రీవిద్యా పూర్ణదీక్ష పొందారు. అప్పటికే ఆయన ఆధ్యాత్మిక శిఖరతుల్యులుగా ప్రసిద్ధులు. ఆయన నుండి అమ్మవారి ఉపాసనా మార్గదర్శకత్వం పొందిన ప్రియ శిష్యులు, SCSGP సంస్థాపకులయిన శ్రీ మధుసూదన్ రావు (శ్రీ శ్రీవిద్యానందనాథ) గారియందు సదా అత్యంత పుత్రవాత్సల్యం కలిగి ఉండేవారు. దేహంతో ఉండగా నమ్మిన వారిని ఎందరినో అమ్మవారి మార్గంలో తరింపజేశారు. 2008 వ సంవత్సరం, నవరాత్రులలో పంచమి రోజు ఆయన భౌతిక దేహాన్ని విడిచి మణిద్వీపానికి తరలి వెళ్లారు. నేటికీ అనుయాయులను ఎన్నో నిదర్శనాలతో అనుగ్రహిస్తున్నారు. తాడిపత్రి లలితా సుందరేశ్వరుల ఆలయంలో నేటికి వీరి దేదీప్యమానమైన దివ్యాపాదుకలను దర్శించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCSGP @ 2008-2021 | All rights reserved.